తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు గోదావరి, క్రిష్ణా పుష్కరాలు ఎంత ఘనంగా జరిగాయో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి పుష్కర వేడుకలు మరోసారి కనువిందు చేయనున్నాయి.
కరోనా వంటి మహమ్మారి కాలంలో ఈ ఏడాది నవంబర్ 20వ తేదీన మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు డిసెంబర్ 1వ తేదీ వరకు అంటే మొత్తం 12 రోజుల వరకు కొనసాగనున్నాయి.
ఈ పుష్కరాల సమయంలో భక్తులందరూ తుంగభద్ర నదిలో స్నానమాచరించేందుకు ఎంతో ఉత్సాహం చూపుతారు. ఉత్తర భారతంలో గంగానదిలో స్నానం చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో.. దక్షిణాన తుంగభద్ర నది నీళ్లను తాగేందుకు అంతే ప్రాధాన్యత ఇస్తారు భక్తులు.
ఇంతకుముందు 2008 సంవత్సరంలో తుంగభద్ర పుష్కరాలు ఘనంగా జరిగాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే కరోనా కారణంగా అప్పటిలా అందరూ వస్తారా లేదా అనేది కొంత సందేహమే. అయితే పుష్కరాల సమయంలో చాలా మంది ఎందుకని నదిలో నీటిలో స్నానం చేయాలనుకుంటారు.. దీని వల్ల వచ్చే ఫలితాలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
జలమే జీవనాధరం..
ఈ లోకంలో జలానికి ఎంతగానో ప్రాధాన్యత ఉంది. సకల జీవకోటి రాశులన్నింటికీ నీళ్లుంటేనే పండుగ.. నీళ్లతోనే పండుగ. అలాంటి జలం పుట్టిన తర్వాతే జీవకోటి విస్తరించింది. అలాగే జలాధారాల వెంటనే మన నాగరికత విస్తరించింది.
జలదేవత..
అలాంటి జలాన్ని దేవతగా భావించి ఆ తల్లిని ఆరాధించడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీగా వస్తుంది. అందుకే మన దేశంలో నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగస్నానాలు, మంగళస్నానాలు అని హిందూ సంప్రదాయాలతో నీటితో ముడి వేశారు.



